హైదరాబాద్: సోమవారం (ఏప్రిల్ 8) బన్నీ జన్మదినం. అల్లు అర్జున్ (బన్నీ) ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలను తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎవడు చిత్రం సెట్ లో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తన సన్నిహితుల సమక్షంలో వారి ఆశీస్సులతో వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలో నిర్మాత గణేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్... హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో..' లో చేస్తున్నారు. ఇది ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం. ఇదివరకు వచ్చిన సినిమా 'దేశముదురు' ఏ స్థాయి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరితో 'ఇద్దరమ్మాయిలతో..' సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్నారు.
'గబ్బర్ సింగ్', 'బాద్ షా' వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత ఆయన నిర్మిస్తున్న సినిమా ఇదే. ఇందులో బన్నీ సరసన అమలా పాల్, కేతరిన్ ట్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ "నిర్మాతల శ్రేయస్సు కోరే బంగారం లాంటి హీరో బన్నీ. నిర్మాత పని కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయన కెరీర్‌లో 'ఇద్దరమ్మాయిలతో..' నెంబర్‌వన్ అవుతుందని గ్యారెంటీ ఇస్తున్నాను.
ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఆయన కెరీర్‌లో మళ్లీ 'పోకిరి' అంత పెద్ద హిట్టవుతుందని నా నమ్మకం. కథలో చాలా దమ్ముంది. బన్నీని పూరి అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్యాంకాక్‌లో ఫైట్‌మాస్టర్ కిచ్చా ఆధ్వర్యంలో తీసిన యాక్షన్ సన్నివేశాలు గొప్పగా వచ్చాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య నేతృత్వంలో స్పెయిన్‌లో చిత్రీకరించిన పాట స్పెషల్ హైలైట్.
అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'ఇద్దరమ్మాయిలతో..'ను మరో మ్యూజికల్ బొనాంజాగా మలిచారు. పూరితో పనిచేయడం అతనికి ఇదే మొదటిసారి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మా సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ మూడో వారంలో పాటల్నీ, మే 9న చిత్రాన్నీ విడుదల చేయాలని సంకల్పించాం'' అని చెప్పారు. బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
No comments:
Post a Comment
Thanks for your Comment